Gold Price Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గత కొద్దిరోజుల గతంలో ఎన్నడూ లేని విధంగా పుత్తడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా కొనుగోలుదారులు ధరల పెరుగులతో ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం ఢిల్లీలో బంగారం ధర రూ.1300 పెరిగి.. తులం రూ.90,750కి చేరింది. ఇక 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ రూ.1300 పెరిగి తులానికి రూ.90,930కి చేరుకుంది. వెండి ధర సైతం రూ.1300 పెరిగి.. కిలో ధర రూ.1,02,500 వద్ద ముగిసింది. అమెరికా సుంకాలపై అనిశ్చితి, వాణిజ్య ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని సడలించనున్నదనే అంచనాల మధ్య ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ర్యాలీ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో పసిడి, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లపై ఈ ప్రభావం పడుతున్నది.
ప్రపంచ మార్కెట్లో ఔన్సుకు బంగారం 2,998.9 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.88,310ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ట్రాయ్ ఔన్స్‌కు 14.48 పెరిగి 2,998.90 డాలర్లకు చేరుకుంది. బంగారం రికార్డు స్థాయిలో పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తుండడం.. ప్రపంచంలో ఆర్థిక యుద్ధాల భయం ధరల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. దాంతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య, ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పెరిగిందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర ఏకంగా రూ.11,360 అంటే.. 14.31శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది జనవరి ఒకటిన తులం బంగారం ధర రూ.రూ.79,390 వద్ద కొనసాగింది. ప్రస్తుతం (మార్చి 17) నాటికి రూ.90,750కి పెరిగింది.