Gold-Silver Price | పుత్తడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పసిడి ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.820 పెరిగి తులానికి రూ.98,490కి చేరుకుంది. మరో వైపు 22 క్యారెట్ల గోల్డ్ ధర సైతం రూ.750 పెరిగి తులం ధర రూ.98వేలకు ఎగిసింది. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టులు భారీగా పసిడిని కొనుగోలు చేయడంతో ధర పెరిగింది. మరో వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో ధర రూ.1.07లక్షలు పలుకుతున్నది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 12.09డాలర్లు పెరిగి 3,334.69 డాలర్లకు ఎగిసింది. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ వెండి 0.5 శాతం తగ్గి ఔన్సుకు 36.34కి చేరుకుంది.
సుంకం అనిశ్చితిపై ఆందోళనలు బంగారానికి డిమాండ్‌ను పెంచాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను కొనసాగించడానికి ఫెడరల్ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం డిమాండ్‌ను పెంచుతున్నాయి. మార్కెట్లోని నిపుణుల దృష్టి రాబోయే యూఎస్ వినియోగదారుల ధరల సూచిక డేటాపై ఉందని కొటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా పేర్కొన్నారు. ద్రవ్య విధాన దృక్పథంపై ఇండెక్స్ మరింత సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. ఇక హైదరాబాద్‌లో ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.90,200 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.98,400 పలుకుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.19లక్షలుగా ఉన్నది.