Gold Rate Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. స్టాకిస్టుల నుంచి కొనుగోళ్లు జరుపడంతో ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.200 పెరిగి తులానికి రూ.99,020కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి తులానికి రూ.98,600కి చేరింది. అదే సమయంలో వెండి ధర కిలోకు రూ.500 పెరిగి రూ.1,12,500కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ మాట్లాడుతూ బుధవారం సానుకూల ధోరణి కనిపించిందని.. డిమాండ్ కొనసాగడంతో ధరలు పెరిగాయని తెలిపారు. ఔషధ దిగుమతులపై కొత్త సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం హెచ్చరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం తక్కువగానే మొదలై కాలక్రమేణా 250 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. సెమీకండక్టర్లు, చిప్‌లు సుంకాలకు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. సుంకాలపై అనిశ్చితి కారణంగా బంగారంపై రిస్క్ ప్రీమియం పెంచిందని తెలిపారు. త్వరల వెలువడనున్న ఫెడరల్ రిజర్వ్ సభ్యుల ప్రసంగాలపై పెట్టుబడిదారులు నిఘా వేసి ఉంచారని.. ఇది బులియన్ ధరల దిశపై మార్గదర్శకంగా ఉంటుందని చెప్పారు. మరో వైపు బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోయాయి. న్యూయార్క్‌లో గోల్డ్ స్పాట్ 17.51 తగ్గి ఔన్సుకు 3,363.35 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా వెండి స్పాట్ 0.12 శాతం తగ్గి ఔన్సుకు 37.76కి చేరుకుంది.
అంతర్జాతీయంగా ఔన్సుకు 3,360 కంటే తక్కువకు చేరుకోవడం వల్ల బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది అన్నారు. గత కొన్ని రోజులుగా డాలర్ ఇండెక్స్ సానుకూల వృద్ధిని చూస్తుందని.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలకు మద్దతు లభిస్తుందని చెప్పారు. వాణిజ్య ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతున్నాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా అన్నారు. యూరోపియన్ యూనియన్ డిమాండ్‌ను నెరవేర్చకపోతే 35శాతం వరకు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో కొత్త సుంకాలు ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయని.. ఇతరదేశాలతో అమెరికా వాణిజ్య చర్చలను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. ద్రవ్యోల్బణం పెరగడానికి తీయొచ్చని.. బంగారం ధరలకు మద్దతు ఇవ్వవచ్చని చెప్పారు.