Gold Rates | గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు ఇటీవల దిగివచ్చాయి. క్రమంగా ధరలు దిగిస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట పొందుతున్నారు. అయితే, బంగారం ధరలు ఒకే రోజు భారీగా పెరిగాయి. దాంతో బంగారం మళ్లీ రూ.లక్ష మార్క్ దాటింది. దాంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం రూ.1000 పెరిగి తులం రూ.లక్ష దాటింది. స్టాకిస్టుల పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడడంతో ధరలు పెరిగాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1000 పెరగడంతో తులానికి రూ.1,00,020కి చేరి నాలుగు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర సైతం రూ.1000 పెరగడంతో తులానికి రూ.99,550కి పలుకుతున్నది. ఇక వెండి ధర భారీగా పెరిగింది. రూ.3వేలు పెరుగడంతో కిలో రూ.1.14లక్షలకు ఎగిసింది. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ బంగారం 0.28 శాతం తగ్గి ఔన్సుకు 3,387.42కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ వెండి కూడా 0.11 శాతం తగ్గి ఔన్సుకు 38.89కి పడిపోయింది. ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ.. కామెక్స్‌లో బంగారం 3,395 నుంచి 3,383 డాలర్ల మధ్య ట్రేడవుతుందని తెలిపారు. అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధాన వైఖరిపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పాల్ మార్గనిర్దేశనం, గవర్నర్ బిచెల్ బౌమన్ ప్రసంగాలను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తారన్నారు.
ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని కమోడిటీస్ అండ్ కరెన్సీ రీసెర్చ్ విశ్లేషకురాలు రియా సింగ్ మాట్లాడుతూ.. వ్యాపారులు చైనా లోన్ ప్రైమ్ రేట్ డెసిషన్, పీఎంఐ, మన్నికైన వస్తువుల ఆర్డర్‌తో సహా కీలకమైన యూఎస్ స్థూల ఆర్థిక డేటా కోసం నిరీక్షిస్తున్నారన్నారని తెలిపారు. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి రూ.92,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.1,01,290 పలుకుతున్నది. ఇక వెండి ధర కిలోకు రూ.1.28లక్షలు పలుకుతున్నది.