Gold | బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. వరుస సెషన్లో ధరలు దిగి వస్తున్నాయి. స్టాకిస్టుల అమ్మకాల నేపథ్యంలో ధరలు పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.400 తగ్గి తులానికి రూ.97,620కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర రూ.300 తగ్గి తులానికి రూ.97,500 పడిపోయింది. అదే సమయంలో వెండి సైతం భారీగా తగ్గుముఖం పట్టింది. కిలోకు రూ.2500 పతనమై.. రూ,1,09,500కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. అంతర్జాతీ మార్కెట్లో బంగారం ప్రస్తుతం ఔన్స్‌కు 3,290 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. స్పాట్ గోల్డ్ 0.12శాతం పెరిగి ఔన్స్‌కు 3,294.31 డాలర్లకు చేరుకుంది. ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెంట్, పరిశోధన విశ్లేషకుడు జతిన్ త్రివేది మాట్లాడుతూ.. ఈ తగ్గుదల అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడు.. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు లేకపోవడం వల్లేనన్నారు. దాంతో బంగారం పెట్టుబడి ఆస్తులపై సెంటిమెంట్ తగ్గిందన్నారు.
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ వారంలో చివరిరోజున బంగారం ప్రతికూల ధోరణి ఉంటుందని.. వారంలో తగ్గుదలతోనే మార్కెట్ ముగుస్తుందన్నారు. డిమాండ్ తగ్గడం, యూఎస్ డాలర్ రికవరీ కారణంగా ధర తగ్గిందని చెప్పారు. ఈ వారం ఇప్పటి వరకు 2శాతానికి పెరిగి తొమ్మిది వారాల గరిష్టానికి చేరుకుందని పేర్కొన్నారు. సుంకాల అనిశ్చితి కారణంగా మార్కెట్లో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని ప్రెషియస్ మెటల్స్ రీసెర్చ్ అనలిస్ట్ మానవ్ మోదీ పేర్కొన్నారు. యూఎస్ వ్యవసాయేతర వేతన డేటాపై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకరించడంతోపాటు సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను 4.25శాతం నుంచి 4.50శాతం పరిధిలోనే కొనసాగించనుందనే అంచనాలున్నాన్నారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు సైతం సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గింపు ఆశలుపై నీళ్లు చల్లినట్లయ్యింది. మార్కెట్‌పై అమెరికా వ్యవసాయేతర డేటా, సుంకాల సంబంధిత నిర్ణయాలపై దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు.