Gold Price | బంగారం ధర తగ్గేదెలేదని అంటున్నది. రోజుకు ధర పెరిగిపోతున్నది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం అంటేనే బాబోయ్ అనే పరిస్థితి ఎదురవుతున్నది. తాజాగా ఢిల్లీలో గురువారం మరోసారి పెరిగి ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో ఢిల్లీలో రూ.70 పెరిగి తులం ధర రూ.98,170కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర సైతం రూ.70 పెరిగి.. తులానికి రూ.97,720కి ఎగిసింది.
డాలర్ బలహీనపడడం, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళన పెరుగుతుండడంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయని అబాన్స్ ఫైనాన్షియల్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్నందున ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా సరఫరా గొలుసుకు అంతరాయం కలిగిస్తుందని.. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయన్నారు. ఆర్థిక యుద్ధం కారణంగా మార్కెట్లు ఇబ్బందులుపడుతుండగా.. బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని చెప్పారు. బంగారం ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండగా.. కేంద్ర బ్యాంకులు సైతం బంగారం కొంటున్నాయని మెహతా తెలిపారు. మరో వైపు వెండి ధర పతనమైంది. రూ.1,400 తగ్గి.. కిలోకు రూ.98వేలకు చేరుకుంది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నది. ఔన్స్‌కు 3,357.81 డాలర్లు పలుకుతున్నది. ఆసియా మార్కెట్లో స్పాట్ సిల్వర్ 1.37 శాతం తగ్గి ఔన్స్‌కు 32.32 డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా వాణిజ్య విధానం కారణంగా ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం హెచ్చరించారు. ట్రంప్ యంత్రాంగం సుంకాలు ఊహించిన దాటికంటే ఎక్కువగా ఉన్నాయని.. వీటిపై ఎలా ఆలోచించాలో సైతం అర్థం కావడం లేదన్నారు. ఈ టారిఫ్ విధానాలో తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్‌ని ముంచేశాయని మండిపడ్డారు. టారిఫ్‌ల కారణంగా నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.