ఎన్టీఆర్ తాజా సినిమా ‘డ్రాగన్’ నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని విధంగా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ మారనుందని తెలిసింది. ‘డ్రాగన్’ కేవలం వర్కింగ్ టైటిల్ అని, అదే ఫైనల్ కాదని చిత్ర నిర్మాతలు గతంలోనే తెలియజేశారు.
ఈ చిత్రానికి ‘బ్రూస్లీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం ఈ సినిమా జోర్డాన్‌లో షూటింగ్ జరుపుకుంటున్నది. ఎన్టీఆర్ పాల్గొనగా భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, టోవినో థామస్ తదితరులు ప్రధాన పాత్రధారులు. జూన్ నెలలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.