మల్కాజిగిరి, ఫిబ్రవరి 18: మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై కలెక్టర్ మను చౌదరిని బుధవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై విస్త్రృతంగా చర్చించారు. ఈ మేరకు పనుల వివరాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం మర్రి మాట్లాడుతూ.. మౌలాలి, గౌతంనగర్ డివిజన్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను కేటాయించాలని కోరారు. వినాయక్‌నగర్ డివిజన్ సఫిల్‌గూడలో ఇప్పటికే కేటాయించిన ప్రభుత్వ భూమికి బదులుగా, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలన్నారు.
యాప్రాల్‌లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థలాన్ని రక్షిస్తూ, దానిని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్నారు. బ్రాహ్మణ సంఘం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, నేరేడ్మెట్, ఆర్కేపురం, అంతయ్యకాలనీలో కమ్యూనిటీ స్థలాలను రక్షించాలన్నారు. అల్వాల్ పరిధిలోని భూదాన్ భూముల్లో స్టేడియం, క్రీడా మైదానాల నిర్మాణానికి తగిన స్థలం ఇవ్వాలన్నారు. ఆర్కేపురం ైప్లెఓవర్ నిర్మాణంతో ప్రభావితమవుతున్న ఆర్మీ భూముల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలన్నారు. ఏఓసీ అదనపు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించేలా చూడాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపన కోసం తగిన స్థలం కేటాయించాలని కోరారు. వక్ఫ్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన సెక్షన్ 22ఏ నుంచి తొలగించాలన్నారు.