న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. రోజుకొక గరిష్ఠ స్థాయికి ఎగబాకుతున్న పుత్తడి ధర మరో ఉన్నత శిఖరాలను అధిగమించింది. దేశ రాజధాని నూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర మరో రూ.250 ఎగబాకి రూ.1,13,000కి చేరుకున్నది. సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం, డాలర్ బలహీనపడటం, అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లిస్తుండటంతో వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర రూ.34,050 లేదా 43.12 శాతం ఎగబాకింది. డిసెంబర్ 31, 2024న రూ.78,950 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. రికార్డుస్థాయికి చేరుకున్న వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ.300 దిగి రూ.1,28,500గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,657.09 డాలర్లు పలుకగా, వెండి 41.23 డాలర్లుగా నమోదైంది.