Gold Price | న్యూఢిల్లీ, అక్టోబర్ 21: బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) గోల్డ్ రేటు గత వారం మునుపెన్నడూ లేనివిధంగా 10 గ్రాములు రూ.1,34,800 పలికిన విషయం తెలిసిందే. అలాగే కిలో వెండి విలువ కూడా ఆల్‌టైమ్ హైని తాకుతూ 1,85,000గా నమోదైన సంగతీ విదితమే. ఈ క్రమంలో ధరలు కొంతమేర తగ్గినా.. తిరిగి పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్స్ మార్కెట్లలో విజృంభిస్తున్న సంకేతాలనే ఇస్తున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై డిసెంబర్ డెలివరీకిగాను సోమవారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.3,580 లేదా 2.82 శాతం పెరిగి తులం రూ.1,30,588 పలికింది. ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ శుక్రవారం రూ.1,27,008కి దిగజారినది తెలిసిందే. అయితే అంతకుముందు రూ.1,32,294 స్థాయిని తాకి ఆల్‌టైమ్ హై రికార్డు నమోదైంది. మళ్లీ ఒక్కరోజు వ్యవధిలో రూ.3,580 పెరిగి మార్కెట్లో గోల్డ్ రష్కు అద్దం పట్టింది. ఇక డిసెంబర్‌కుగాను సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,571 లేదా 1 శాతం పుంజుకొని కిలో రూ.1,58,175గా నమోదైంది. రికార్డు హై నుంచి ఇది దాదాపు 6 శాతం తక్కువ. అయినప్పటికీ పరిశ్రమల నుంచి డిమాండ్, సరఫరాలో అడ్డంకుల వల్ల ధరలు తిరిగి పరుగులు పెడుతున్నాయి. నిజానికి స్పాట్ మార్కెట్ కంటే ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు తక్కువగా ఉంటాయి. అయితే ఫ్యూచర్స్ మార్కెట్ ఆధారంగా స్పాట్ మార్కెట్లో ధరలు పెరిగేందుకున్న అవకాశాలను ఒకింత అంచనా వేయవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. రాబోయే ద్రవ్యసమీక్షల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించబోతున్నదన్న సంకేతాలు.. బాండ్ మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. దీంతో మదుపరులకు తమ పెట్టుబడుల రక్షణార్థం కనిపిస్తున్న ఏకైక మార్గం బంగారమే అవుతున్నదని ఆర్థిక, మార్కెట్ నిపుణులు ప్రస్తుత సరళిని విశ్లేషిస్తున్నారు. అందుకే బంగారం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రపంచ స్థాయిలో డిసెంబర్ డెలివరీకిగాను ప్రధాన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ కొమెక్స్లోనూ గోల్డ్ 62.46 డాలర్లు లేదా 1.48 శాతం ఎగబాకి ఔన్స్ 4,275.76 డాలర్లు పలికింది. సిల్వర్ 1.5 శాతం ఎగసి ఔన్స్ 50.85 డాలర్లు పుంజుకున్నది. ఈ నేపథ్యంలో సాధారణ కొనుగోలుదారులు.. పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసమైతే అవసరాన్నిబట్టి బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ సలహా. ఇక మదుపరులు.. ఇప్పుడున్న అధిక ధరల్లో పెద్ద ఎత్తున గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయడం అంత తెలివైన నిర్ణయం కాదని అంటున్నారు. కొద్ది మొత్తాల్లో పెట్టుబడులకు దిగడమే ఉత్తమం అని చెప్తున్నారు.
ఏడాది క్రితం కిలో రూ.90,000 పలికిన వెండి ధర.. ఇప్పుడు రెట్టింపైంది. ఒకానొక దశలో రూ.2 లక్షలను తాకుతుందన్న అంచనాలూ వినిపించాయి. ఇటీవలికాలంలోనైతే రోజూ రూ.5వేల నుంచి రూ.8వేలు పెరిగిన సందర్భాలుండటం.. మార్కెట్లో వెండి గిరాకీకి అద్దం పడుతున్నది. దీనికి పరిశ్రమల నుంచి ఉన్న డిమాండే ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. ఎలక్ట్రికల్స్-ఎలక్ట్రానిక్స్, ఆటో-ఎలక్ట్రిక్ వెహికిల్స్, సోలార్ ఎనర్జీ, సెమీకండక్టర్, మెడిసిన్, బ్రేజింగ్ అల్లాయిస్-సోల్డర్స్ తదితర పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక బంగారం ధర కొండెక్కడంతో చాలామంది సిల్వర్ జ్యుయెల్లరీపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. వెండి నగల తయారీ బాగా పెరిగింది. అలాగే ఇన్వెస్టర్లు, ముఖ్యంగా బ్యాంకులు పసిడి నిల్వలతోపాటు వెండి నిల్వలనూ పెంచుకుంటున్నాయి. ఈ కారణాల చేతనే వెండి ఆదరణ ఎక్కువైందని బులియన్, నగల వర్తకులు పేర్కొంటున్నారు.