న్యూఢిల్లీ, ఆగస్టు 8 : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఎగిశాయి. శుక్రవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) గోల్డ్ రేటు 10 గ్రాములు మరో రూ.800 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,03,420 పలికినట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. అమెరికా సుంకాలు, దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల నడుమ మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపునకు మళ్లిస్తున్నారని మార్కెట్ పరిశీలకులు తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు. ఇక గత 5 రోజుల్లో తులం విలువ ఏకంగా రూ.5,800 పుంజుకోవడం గమనార్హం.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ పుత్తడి విలువ రూ.760 ఎగబాకి రూ.1,03,310గా నమోదైంది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) ధర రూ.700 అందుకుని రూ.94,700 పలికింది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,15,000కు చేరింది. గడిచిన 5 రోజుల్లో రూ.5,500 ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్స్ గోల్డ్ 3,388.56 డాలర్లుగా ఉన్నది. ఒకానొక దశలో ఆల్‌టైమ్ హైని సూచిస్తూ 3,500.33 డాలర్లను తాకడం గమనార్హం. వెండి ఔన్స్ 38.28 డాలర్లుగా ఉన్నది.