Gold Price | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. గడిచిన రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా తులం బంగారం ధర రూ.59 వేల దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పసిడి ధర రూ.650 తగ్గి రూ.58,950గా నమోదైంది. అంతకుముందు ధర రూ.59,600గా ఉన్నది. గడిచిన రెండు రోజుల్లోనే బంగారం వెయ్యి రూపాయల స్థాయిలో తగ్గినట్టు అయింది.
పసిడితోపాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. కిలో వెండి ఏకంగా రూ.1,000 తగ్గి రూ.73,100కి దిగొచ్చింది. అటు హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్ల తులం ధర రూ.650 తగ్గి రూ.59,450 నుంచి రూ.58,800 దిగిరాగా, 22 క్యారెట్ల ధర రూ.600 తగ్గి రూ.53,900కి తగ్గింది. అలాగే కిలో వెండి రూ.500 దిగి రూ.76,500కి చేరుకున్నది. అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ ఈల్డ్‌లు బలోపేతం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. ఔన్స్ గోల్డ్ ధర 1,877 డాలర్లకు పడిపోగా, వెండి 22.55 డాలర్లుగా నమోదైంది.