Gold Rates | హైదరాబాద్/న్యూఢిల్లీ, జూన్ 24 : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.1,470 దిగి లక్ష రూపాయల మార్కుకు దిగువన రూ.99,220 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం విలువ కూడా రూ.1,350 దిగొచ్చి రూ.90,950 వద్ద నిలిచింది. కాగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ తులం రేటు రూ.900 తగ్గి రూ.98, 900గా నమోదైనట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలియజేసింది.
పశ్చిమాసియానేగాక, యావత్తు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వల్లే గోల్డ్ మార్కెట్లో ఈ రివర్స్ ట్రెండ్ అని నిపుణులు తాజా మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు. గతకొద్ది రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పరస్పర దాడులతో బీభత్సం సృష్టించాయి. ఈ ఘర్షణల్లోకి అమెరికా కూడా ప్రవేశించడంతో పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లలో వాటిల్లుతున్న నష్టాలను అధిగమించడానికి మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపునకు అడుగులు వేస్తూ వచ్చారు. అయితే ఇరాన్-ఇజ్రాయెల్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయన్న వార్తలు.. ఇన్వెస్టర్ల చూపును మళ్లీ ఈక్విటీల వైపునకు మరల్చాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరల తగ్గుదల అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్లో బంగారం ధరలతోపాటు వెండి ధరలూ క్షీణిస్తున్నాయి. న్యూఢిల్లీలో కిలో రేటు ఈ ఒక్కరోజే రూ.1,000 పతనమైంది. దీంతో రూ.1,04,200 వద్ద స్థిరపడింది. సాధారణ కొనుగోలుదారులతోపాటు నాణేల తయారీదారులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ తగ్గిందని.. అందుకే వెండి ధరలు క్రమేణా దిగొస్తున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ నెలలోనే వెండి కిలో ధర మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హై రికార్డును సృష్టిస్తూ రూ.1,08,100గా నమోదైన సంగతి విదితమే. అయితే గడిచిన రెండు వారాల్లో కిలో రేటు దాదాపు రూ.4వేలదాకా పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తులం 24 క్యారెట్ బంగారం ధర దేశీయంగా గరిష్ఠంగా రూ.1,01,600 పలికిన సంగతీ విదితమే.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమేణా క్షీణిస్తున్నాయి. ఔన్స్ గోల్డ్ ధర 46.05 డాలర్లు లేదా 1.37 శాతం పడిపోయి 3,323.05 డాలర్లకు పరిమితమైంది. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యవిధానాన్ని ఇన్వెస్టర్లు దగ్గరగా గమనిస్తున్నారని, ఈ క్రమంలోనే గోల్డ్ మార్కెట్ రివర్స్ గేర్ తీసుకుందన్న అంచనాలు వినిపిస్తున్నాయిప్పుడు. వడ్డీరేట్లను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పట్నుంచో చెప్తున్నప్పటికీ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ససేమిరా అంటున్నారు. వడ్డీరేట్ల కోతలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తాజాగా మరోసారి స్పష్టం చేశారు. దీంతో గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరల క్షీణతకు దారితీసింది. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై వేచిచూసే ధోరణినే అవలంబిస్తున్నామన్నారు. సాధారణంగా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గితే బంగారం ధరలు మార్కెట్లో పెరుగుతాయి. అలాగే వడ్డీరేట్లు పెరిగితే గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది.