న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: బంగారం ధరలు మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మంగళవారం మరో ఆల్‌టైం హైకీ చేరుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర మరో రూ.500 ఎగబాకి రూ.1.20 లక్షలకు చేరుకున్నది.
ఈ మైలురాయికి చేరుకోవడం ఇదే తొలిసారని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. సోమవారం గోల్డ్ ధర రూ.1,500 ఎగబాకిన విషయం తెలిసిందే. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర వరుసగా నాలుగోరోజు రూ.500 అందుకొని రూ.1,19,400 పలికింది. మరోవైపు, గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో డిసెంబర్ నెల డెలివరీకిగాను స్వల్పంగా తగ్గి రూ.1,16,203గా నమోదైంది.
బంగారంతోపాటు వెండి కూడా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. రూ.1.50 లక్షలకు చేరుకున్న కిలో వెండి మరో అడుగుముందుకేసి రూ.1,50,500కి చేరుకున్నది. నిన్నటితో పోలిస్తే కిలో ధర రూ.500 అధికమైంది. సోమవారం ఒకేరోజు వెండి రూ.7 వేలు పె రిగిన విషయం తెలిసిందే. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి బక్కచిక్కుతుండటంతో బంగారం ధర పుంజుకోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి 3,813.14 డాలర్లకు తగ్గగా, అలాగే వెండి కూడా 1.51 శాతం దిగి 46.22 డాలర్లుగా నమోదైంది.
అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా మదుపరుల్లో సెంటిమెంట్ నిరాశపరిచింది. ప్రస్తుత సంవత్సరంలో పుత్తడి ధర రూ.41,050 లేదా 52 శాతం ఎగబాకింది. డిసెంబర్ 31, 2024న రూ.78,950 స్థాయిలో ఉన్న పదిగ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1.20 లక్షలకు చేరుకున్నది. అలాగే కిలో వెండి రూ.60,800 లేదా 67.78 శాతం ఎగబాకింది. గతేడాది చివరిరోజు రూ.89,700గా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.1.50 లక్షలకు ఎగబాకింది. వెండిఅంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా మదుపరుల్లో సెంటిమెంట్ నిరాశపరిచింది.
స్వల్పకాలిక నిధులపై ట్రంప్-కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేకుండా ముగియడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. అమెరికా ప్రభుత్వం మూతపడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన పుత్తిడి వైపు మళ్లించడంతో వీటి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.
– కాయంత్ చైనావాల, కొటక్ సెక్యూరిటీ కమోడిటీ రిసర్చ్ ఏవీపీ