Gold Rate Hike | పసడి ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధరలు మళ్లీ భారీగా పెరిగింది. తులం బంగారం రూ.69వేల మార్క్‌ను తాకి.. తొలిసారి జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నది. పెరుగుతున్న ధరలతో బంగారం అంటేనే బాబోయ్ అనే పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులకు ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతున్నది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు రికార్డు స్థాయిలో 2,281.60 డాలర్లకు చేరింది. ట్రేడింగ్ ఔన్స్‌కు దాదాపు 2,233 డాలర్ల వద్ద ప్రారంభం కాగా.. తక్కువ సమయంలో రికార్డు స్థాయికి చేరుకున్నది.
అంతర్జాతీయ మార్కెట్లోని ధరల ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం ప్రభావం పడుతున్నది. ఓపెనింగ్ సెషన్లోనే పసిడి రికార్డు స్థాయికి చేరుకున్నది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ తులానికి రూ.69,487 చేరుకున్నది. ఇప్పటి వరకు బంగారం ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలో అత్యధికంగా చెన్నై నగరంలో తులం బంగారం రూ.70వేల మార్క్‌ను దాటింది. సోమవారం మార్కెట్లో 22 క్యారెట్ల బంగారంపై రూ.850 పెరిగి తులం రూ.63.600కి ఎగిసింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.930 పెరిగి.. తులం రూ.69,380కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను చూస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.64,550కి పెరిగింది.
24 క్యారెట్ల పసిడి రూ.70,420కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.63,600కి పెరగ్గా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.69,380కి ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.63,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,530కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.63,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.69,380కి దూసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం ఎగిసింది. రూ.600 పెరిగి.. కిలో ధర రూ.78,600కు చేరింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.81,600కి పెరిగింది.