Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. భారీ అమ్మకాలు, ప్రపంచ మార్కెట్లో డిమాండ్ లేమి నేపథ్యంలో బంగారం ధరలు సోమవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పుత్తడి ధర రూ.1550 తగ్గి.. తులం ధర రూ.91,450కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. గత శుక్రవారం 99.9 ప్యూరిటీ గోల్డ్ తులానికి రూ.93వేలు పలికింది. ఇక 99.5 ప్యూరిటీ గోల్డ్ సైతం సోమవారం రూ.1550 తగ్గి రూ.91వేలకు చేరుకుంది. వరుసగా ఐదోరోజు వెండి ధర తగ్గింది. రూ.3వేలు తగ్గి.. కిలో రూ.92,500కి చేరుకుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సెగ్మెంట్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ స్టాక్ మార్కెట్‌తో పాటు ఇతర రంగాల్లో భయాందోళనల మధ్య ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం బంగారం, వెండిపై ఒత్తిడి కొనసాగుతుందన్నారు. గత ఐదు సెషన్లలో కిలో వెండి ధర రూ.10,500 తగ్గిందన్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 10.16 డాలర్లు తగ్గి 3,027.20 డాలర్లకు చేరింది. ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ సెగ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ.. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని పెట్టుబడిదారులు ఆసక్తిగా చూస్తున్నారన్నారు. రాబోయే యూఎస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డేటా వడ్డీ రేటు తగ్గింపు అంచనాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ దశ, దిశను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఈ వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ మీటింగ్‌ని సైతం ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారన్నారు. అయితే, సోమవారం ఆసియా మార్కెట్లో స్పాట్ వెండి ధరలు 1.65 శాతం పెరిగి ఔన్స్‌కు 30.04 డాలర్లకు చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటన, చైనా ప్రతీకార సుంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది.