న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. అమెరికా ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పోవెల్ వడ్డీరేట్లను తగ్గించాల్సివుంటుందని హెచ్చరికల నేపథ్యంలో ట్రేడర్లు ప్రాఫిట్కు మొగ్గుచూపారు. ఫలితంగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,18,000గా నమోదైంది.
అంతకుముందు ధర రూ.1,18, 900గా నమోదైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర అంతే స్థాయిలో తగ్గి రూ.1,17,400కి పరిమితమైంది. మంగళవారం రికార్డు స్థాయిలో రూ.2,650 ఎగబాకిన విషయం తెలిసిందే. బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ.600 తగ్గి రూ.1,39,600కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,760.36 డాలర్లకు, వెండి 43.87 డాలర్లకు తగ్గాయి.