న్యూఢిల్లీ, జూన్ 13: బంగారం మళ్లీ దూసుకుపోయింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్ మిలటరీ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ దేశాల్లో ఒకేసారి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అతి విలువైన లోహాల ధరలతోపాటు క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర తిరిగి లక్ష రూపాయలు అధిగమించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.2,200 ఎగబాకి రూ.1,01,540 గా నమోదైంది. దీంతోపాటు 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,00,700 పలికింది. గతంలో ఏప్రిల్ 22న బంగారం ధర రూ.1,800 ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,01,600 పలికింది. బంగారంతోపాటు వెండి కూడా పరుగులు పెట్టింది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం వెండి రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. కిలో వెండి రూ.1,100 ఎగబాకి రూ.1,08,100 పలికింది. ఈ నెల 9న కూడా వెండి ధర రూ.1,000 అధికమై చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,08,100కి చేరుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో ఆగస్టు నెల డెలివరీ కాంట్రాక్ట్గాను రూ.2,011 ఎగబాకి రూ.1,00,403గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 28.30 డాలర్లు ఎగబాకి 3,415.13 డాలర్లు పలికింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులను పుత్తడి వైపు మళ్లించడం ధర పెరగడానికి కారణమన్నారు.