పసిడి ధరల పరుగు ఆగేలా లేదు. ఇలాగే ఉంటే ఇత్తడిని చూసే పుత్తడి అని మురిసిపోవాలేమో.
సంపన్నులకే దడ పుట్టించేలా ప్రస్తుతం బంగారం రేట్లు పెరుగుతూపోతున్నాయి. ఇక సామాన్యుల సంగతి చెప్పనే అక్కర్లేదు.
లక్ష రూపాయల మార్కుకు కూతవేటు దూరంలో తులం విలువ పలుకుతున్నది మరి. ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాములు ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.99,800గా నమోదైంది.
Gold Rate | న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 : గత కొంతకాలంగా తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరబోతున్నదంటూ వినిపించిన అంచనాలు నిజమయ్యాయి. దేశీయ మార్కెట్లో సోమవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.1,650 ఎగిసి లక్ష రూపాయల సైకలాజికల్ మార్కుకు చేరువై ఏకంగా రూ.99,800 పలికింది. దీంతో ఇక టార్గెట్ రూ.1.50 లక్షలుగా మారింది. అయినా గోల్డ్ రేట్ల దూకుడును చూస్తుంటే ఈ రికార్డూ ఎంతో దూరంలో లేదనిపిస్తున్నదిప్పుడు. పసిడి ధరలకు ఆకాశమే హైద్దెంది మరి. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల నడుమ రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తులం రేటు రూ.20,850 పెరగడం గమనార్హం.
కరెన్సీ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలహీనపడటం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటం.. గోల్డ్ మార్కెట్‌ను షేక్ చేస్తున్నది. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడంతో మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపునకు మళ్లిస్తున్నారు. ఇక బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదలతో కొనుగోలుదారుల నుంచి పెద్దగా గిరాకీ లేకున్నా.. జ్యుయెల్లర్స్, రిటైలర్స్ నుంచి డిమాండ్ కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే మార్కెట్లో పుత్తడి ధరలు దౌడు తీస్తున్నాయని మెజారిటీ నిపుణుల విశ్లేషణ. కాగా, అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం చైనా మినహా మిగతా దేశాలపై ఆగినా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఆ సెగ తగులుతూనే ఉన్నది. ఈ క్రమంలో ఆయా దేశాలతో జరుగుతున్న అమెరికా ట్రేడ్ డీల్స్నుబట్టి భవిష్యత్తులో బంగారం రేట్ల పెరుగుదలలో వేగం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లోనూ బంగారం రేట్లు పరుగులు పెడుతున్నాయి. 24 క్యారెట్ తులం రూ.770 పుంజుకొని రూ.98,350గా నమోదైంది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.700 పెరిగి రూ.90,150గా ఉన్నది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.98,500గా ఉన్నది. ఇదిలావుంటే మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌పై జూన్ డెలివరీకిగాను ఫ్యూచర్స్ ఇండెక్స్‌లో గోల్డ్ 10 గ్రాములు 96,875గా నమోదైంది. ఇక అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ విలువ తొలిసారి 3,397.18 డాలర్లకు చేరింది.