మన దేశంలో బంగారం అంటే ఆస్తికాదు అంతకుమించే. అందుకే ఇప్పటికీ చాలామంది దాన్ని పెడితే ఇంట్లోనో లేదంటే బ్యాంక్ లాకర్లోనో అన్నట్టే ఉంటున్నారు. ఇటీవలికాలంలోనైతే ఇంటికంటే బ్యాంకే పదిలమని పరుగులు పెడుతున్నవారు ఎక్కువైపోయారు. కానీ అక్కడ మీ బంగారానికున్న భద్రతెంత?
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశీయ మార్కెట్లో తులం రేటు లక్షల్లోకెక్కింది. దీంతో ఒకప్పటితో పోల్చితే పుత్తడికి మరింత భద్రతనివ్వాల్సి వస్తున్నది. అందుకు చాలామంది ఇప్పుడు ఎంచుకుంటున్న మార్గం బ్యాంక్ లాకర్. కానీ కాస్త ఆలోచించి చూస్తే మరిన్ని దారులు కనిపిస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. సంప్రదాయ దేశంగా ఉన్న భారత్‌లో బంగారాన్ని ఆస్తికంటే తమ కుటుంబ గౌరవం, వారసత్వం, సెంటిమెంట్‌గా భావించేవారెందరో ఉన్నారు. కాబట్టే ఇప్పటికీ ఇండ్లలోని బీరువాల్లోనో లేదంటే బ్యాంకుల్లోని లాకర్లలోనే బోలెడు బంగారం మరుగునపడిపోయి ఉంటున్నది. అయితే అలా నిరుపయోగంగా పాడైపోవడంకన్నా.. దాన్ని తెలివిగా వాడుకుంటే మన సంపద మరింత వృద్ధిలోకి వస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
బంగారాన్ని బ్యాంకు లాకర్లో పెట్టామని, ఇక నిశ్చింతగా ఉందామనుకుంటే పొరపాటే. వరదలు, అరకొర బీమా, దుమ్ముపట్టిపోవడం వంటి ఎన్నో సమస్యలు మన పుత్తడిని వెంటాడుతాయన్నది మరువద్దు. సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. వరదలు రావడంతో బ్యాంక్ బేస్మెంట్ లాకర్లోకి చేరిన నీరు అందులో భద్రపర్చిన తమ తాతలనాటి బంగారాన్ని ముంచెత్తిందని తన స్నేహితుడు వాపోయిన ఘటనను ఓ ఆర్థిక సలహాదారుడు ఇటీవల వివరించారు. ఈ నష్టానికిగాను బాధితుడికి బ్యాంక్ కేవలం రూ.3 లక్షల బీమా మొత్తాన్ని చెల్లించినట్టు పేర్కొన్నారు. కానీ అక్కడున్న పసిడి విలువ ఇంతకుమించే. అయితే ప్రస్తుతం చాలా లాకర్లకున్న బీమా విలువ రూ.3 లక్షలే. కాబట్టి బ్యాంకులూ ఏమీ చేయలేని పరిస్థితి అంటూ తన లింక్డిన్ పోస్ట్‌లో సదరు ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్లడించారు.
పైన పేర్కొన్న ఘటనలు ఎన్ని జరిగినా.. చాలామంది ఇంకా తమ బంగారం లాకర్లలో ఉంటేనే భద్రమని ఆలోచిస్తున్నారు. కానీ లాకర్లు కనీస రక్షణతోనే ఉంటాయి. దొంగతనాలు, అగ్నిప్రమాదం, ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు లాకర్‌కు చెల్లించే వార్షిక అద్దె ప్రకారమే బాధితులకు నష్టపరిహారం వస్తుందని, ఇదికూడా సాధారణంగా వేల రూపాయల్లోనే ఉంటుందని ఆర్థిక నిపుణులు, బ్యాంకింగ్ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి లాకర్లో ఏముంది? దాని విలువ ఎంతన్నదానితో సంబంధం లేకుండా గరిష్ఠంగా రూ.2-3 లక్షలకు మించి పరిహారం దక్కకపోవచ్చని పేర్కొంటున్నారు. ఫలితంగా బంగారు కడ్డీలు, పాత నాణేలు, పెండ్లి నగలు, వారసత్వంగా వచ్చిన ఆభరణాలను చాలాచాలా తక్కువ నష్టపరిహారంతోనే కోల్పోవాల్సి వస్తుందని గుర్తుచేస్తున్నారు.
మన దగ్గర నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బీరువాల్లో లేదా లాకర్లలో ఏండ్ల తరబడి అలా పెట్టే బదులు.. గోల్డ్ మానిటైజేషన్ స్కీం (పసిడి నగదీకరణ పథకం)లో పెడితే లాభదాయకమని ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. నిజానికి ఈ పథకంలో చేరడమంటే మీ బంగారాన్ని అమ్ముకోవడం కాదు. మీ భవిష్యత్తు అవసరాలకు సరిపడా రాబడులను ఆ పసిడిని సద్వినియోగపర్చుతూ పొందడమే.
ప్రస్తుతం ఈ పథకం కింద 1 నుంచి 3 ఏండ్ల వ్యవధితో బ్యాంకుల్లో మన బంగారాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు. గోల్డ్ స్వచ్ఛతను పరీక్షించి, అధికారికంగా దాని బరువును నిర్ధారించి నమోదు చేస్తారు. నగలను కరిగించి కడ్డీల రూపంలోకి మార్చి నిల్వ చేస్తారు. డిపాజిట్ చేసిన మొత్తాలనుబట్టి ఏటా 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకు వడ్డీ ఆదాయాన్ని అందుకునే వీలున్నది. లాకర్లలో పెడితే దానికి అక్కడ మనమే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. కనుక పసిడి నగదీకరణ పథకం ప్రయోజనకరమే. పైగా బ్యాంకుల్లో పెట్టడం వల్ల సురక్షితం. రస్ట్, దొంగతనం, లాకర్ బీమా పరిమితులు ఇలాంటివేవీ ఉండవు.
ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. దీన్ని ఆర్థిక సలహాగా పరిగణించవద్దు. మీకు తెలిసిన, తెలియవచ్చిన ప్రముఖ ఆర్థిక సలహాదారులను సంప్రదించి పెట్టుబడులపై ఓ నిర్ణయానికి రావడం ఉత్తమం.