Gold Prices | న్యూఢిల్లీ, మే 21: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నమొన్నటిదాకా తగ్గుముఖం పట్టిన రేట్లు.. బుధవారం ఒక్కసారిగా ఎగిశాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.1,910 ఎగబాకి రూ.98,450గా నమోదైంది. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలియజేసింది. కాగా, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ మదుపరులు మరోసారి తమ పెట్టుబడులను పసిడి వైపునకు మళ్లించారు. ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు ఇదే కారణమని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ తులం రేటు రూ.2,400 పుంజుకొని రూ.97,420 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ 10 గ్రాములు రూ.2,200 అందుకొని రూ.89,300 వద్ద నిలిచింది. మరోవైపు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,660 పెరిగి రూ.99,160గా ఉన్నది. ఇక పెండ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండికి డిమాండ్ సహజంగానే ఉన్నదని, దేశ-విదేశీ పరిస్థితులు సైతం రేట్లు పెరిగేలా చేస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కాగా, దేశీయ మార్కెట్లో గత నెల ఏప్రిల్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల రేటు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.1,01,600 పలికిన విషయం తెలిసిందే. అలాగే అంతకుముందు నెల మార్చిలో కిలో వెండి ధర ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.1,03,500గా నమోదైన సంగతీ విదితమే.
స్పాట్ మార్కెట్‌తోపాటు ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం జిగేల్మంటున్నది. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై జూన్ డెలివరీకిగాను గోల్డ్ కాంట్రాక్ట్స్‌లో 10 గ్రాములు రూ.95,665గా ట్రేడ్ అయ్యింది. మునుపటితో పోల్చితే రూ.824 పెరిగింది. ఇక అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్‌కు 3,311.76 డాలర్లు పలికింది. ఫ్యూచర్ గోల్డ్ రేటు ఔన్స్‌కు 3,319.18 డాలర్లుగా ఉన్నది. క్రితం రోజుతో చూస్తే 21 నుంచి 24 డాలర్ల మేరకు పెరుగుదల చోటుచేసుకున్నది.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్ బలహీనపడటం బంగారం ధరల పెరుగుదలకు ఊతమిచ్చింది. ద్రవ్యలోటు భయాలతో అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ తగ్గించడం వల్ల సావరిన్ రిస్క్‌ను మదుపరులు పసిగట్టారు.
-చింతన్ మెహెతా, అబ్నస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో
అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు మరోసారి 3,300 డాలర్ల స్థాయిని అధిగమించింది.
-సౌమిల్ గాంధీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్
ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగవచ్చన్న అంచనాలు ఉద్రిక్తకర పరిస్థితులను పెంచేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలు కూడా మార్కెట్‌ను తీవ్ర ఒడిదొడుకులకు గురి చేస్తున్నాయి.
-కేనట్ చైన్వాలా, కొటక్ సెక్యూరిటీస్ ఏవీపీ