Gold Rate | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తొలిసారి రూ.89,000 మార్కును దాటాయి. ఢిల్లీలో మునుపెన్నడూ లేనివిధంగా G (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి రేటు ఆల్టైమ్ హైని తాకుతూ శుక్రవారం ఏకంగా రూ.89,400 పలికింది. ఈ ఒక్కరోజే రూ.1, 300 పెరగడం గమనార్హం. హోల్సేల్, రిటైల్ నగల వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున కనిపించిన డిమాండే ఇందుకు కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. కాగా, ఈ నెల ఆరంభంలోనే మొదటిసారి రూ.85,000 మార్కును దాటిన మేలిమి బంగారం ధర.. కేవలం 10 రోజుల్లో రూ.4, 000లకుపైగా ఎగబాకడం గమనార్హం.
హైదరాబాద్లో 24 క్యారెట్ తులం బంగారం ధర రూ.87,160గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పుత్తడి రేటు రూ.79,900 పలికింది. ఇదిలావుంటే దేశ రాజధానిలో కిలో వెండి విలువ రూ.2,000 పెరిగి 4 నెలల గరిష్ఠాన్ని తాకుతూ లక్ష రూపాయలకు చేరింది. నగల వ్యాపారులతోపాటు నాణేల తయారీదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ వ్యక్తమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఫ్యూచర్స్ ట్రేడ్ విషయానికొస్తే.. ఎంసీఎక్స్పై ఏప్రిల్ నెల డెలివరీకిగాను గోల్డ్ కాంట్రాక్ట్స్ 10 గ్రాములు రూ.85,993 పలికింది. వెండి కిలో రూ.97,750గా నమోదైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,929.79 డాలర్లుగా ఉన్నది.