న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశమే హద్దు అన్నట్టుగా పరుగులు పెడుతున్నాయి. రోజుకో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. మంగళవారం న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్ (స్థానిక బులియన్ మార్కెట్)లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,800 పుంజుకొని తొలిసారి రూ.1,15,000 మార్కును అధిగమిస్తూ రూ.1,15, 100గా నమోదైంది. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇప్పటిదాకా భారతీయ విపణిలో ఇదే రికార్డు రేటు. కాగా, బలహీనపడిన డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లకు కోత పెడుతుందన్న అంచనాలు.. పుత్తడికి డిమాండ్‌ను తీసుకొచ్చాయి.
హైదరాబాద్‌లోనూ పసిడి ధరలు అప్‌ట్రెండ్‌లోనే ఉన్నాయి. 24 క్యారెట్ తులం రూ.870 పెరిగి రూ.1,11,930 పలికింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.800 అధికమై రూ.1,02,600గా ఉన్నది. ఇదిలావుంటే ఢిల్లీలో వెండి ధరలూ నయా రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. సోమవారం ముగింపుతో పోల్చితే రూ.570 ఎగిసి కిలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,32,870ని తాకింది. కాగా, ప్రస్తుత పండుగ సీజన్లో ధరల్లో స్థిరత్వం లోపించడం.. అమ్మకాలను ప్రభావితం చేస్తున్నదని పలువురు నగల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగితే వ్యాపారం పడిపోవడం ఖాయమనే అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఆల్‌టైమ్ హైని తాకుతూ ఔన్స్ గోల్డ్ రేటు 3,698.94 డాలర్లుగా ఉన్నది. వడ్డీరేట్లను బుధవారం ఫెడ్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దీంతో అటు బయ్యర్లు, ఇటు ఇన్వెస్టర్ల నుంచి గోల్డ్‌కు డిమాండ్ అమాంతం పెరిగిపోయిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వడ్డీరేట్లను బాగా తగ్గించాలని ఫెడ్ రిజర్వ్‌పై ఎప్పట్నుంచో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ప్రభావం ఈసారి ద్రవ్యసమీక్షలో తప్పక ఉంటుందనే అంటున్నారంతా. డిసెంబర్ నుంచి ఫెడ్ వడ్డీరేట్లు తగ్గలేదు. ఇక ఔన్స్ సిల్వర్ రేటు 42.72 డాలర్లు పలుకుతున్నది.
ప్రస్తుత ట్రెండ్‌ను చూస్తే.. ఈసారి దీపావళికి తులం 24 క్యారెట్ బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.1.50,000 పలుకవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ 15 రోజుల్లో రేటు రూ.10,000దాకా పెరగడం గమనార్హం. ఈ నెల 1న రూ.1,05,670 వద్ద ముగిసింది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో రాబోయే దీపావళికల్లా మార్కెట్లో గోల్డ్ విలువ 10 గ్రాములు రూ.1,40,000 నుంచి 1,50,000 మధ్య కదలాడే వీలుందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో ట్రేడ్‌వార్ ముదిరితే ధరలు పరుగులు పెట్టడం ఖాయమనే అంటున్నారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్స్ నుంచి సురక్షిత పెట్టుబడి సాధనమైన గోల్డ్‌కే మళ్లిస్తారని.. దీంతో దేశ, విదేశీ మార్కెట్లలో రేట్లు ఎగబాకుతాయనే విశ్లేషణలున్నాయి. ఏదిఏమైనా దేశీయంగా భవిష్యత్తులో ధరలు ఇక లక్ష రూపాయల దిగువకు రావడం అసాధ్యమనే అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు.