న్యూఢిల్లీ, జనవరి 29: బంగారం ధరలు ఆల్‌టైమ్ హైని చేరాయి. బుధవారం ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.910 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.83,750గా నమోదైంది. జ్యుయెల్లర్స్, రిటైలర్ల నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో బహిరంగ మార్కెట్లో తొలిసారి పసిడి రేట్లు ఈ స్థాయికి చేరాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నది. నిజానికి వరుసగా 8 రోజులపాటు పుంజుకున్న గోల్డ్ రేట్లు.. రెండు రోజులుగా పడిపోయాయి. అయితే మళ్లీ పరుగులు పెట్టడంతో బులియన్ మార్కెట్లో సరికొత్త రికార్డు ధర పలికింది. కిలో వెండి ధర కూడా రూ.1,000 ఎగబాకి రూ.93,000లకు చేరింది.
హైదరాబాద్ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ తులం రూ.920 అందుకుని రూ.82,850గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.850 పెరిగి రూ.75,950ని తాకింది. ఇదిలావుంటే ఎంసీఎక్స్‌పై ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఫిబ్రవరి డెలివరీకిగాను గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం రూ.80,517 పలికింది. మార్చి డెలివరీకి వెండి కిలో రూ.91,156గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. కోమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ 2,794.70 డాలర్లుగా ఉన్నది. వెండి 30.99 డాలర్లుగా నమోదైంది.
రాబోయే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల విషయంలో ప్రదర్శించే వైఖరి.. గోల్డ్ మార్కెట్‌ను ఎక్కువగా ప్రభావితం చేయవచ్చన్న అంచనాలున్నాయి. వడ్డీరేట్లు తగ్గితే బంగారం ధరలు మరింత పరుగులు పెడుతాయని చెప్తున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సుంకాల సమరానికి కాలు దువ్వుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న సంగతి విదితమే. దీంతో మార్కెట్లు పడిపోయినకొద్దీ ఇన్వెస్టర్లు సురక్షిత మదుపు సాధనం బంగారం దిశగా తమ పెట్టుబడులను మళ్లించే వీలుందని, అప్పుడు రేట్లు ఇంకా పెరుగుతాయని కూడా విశ్లేషిస్తున్నారు.