Gold Price | పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇటీవల వరుసగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి సరికొత్తగా రికార్డు స్థాయికి చేరుకుంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆందోళన మధ్య దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1000 పెరిగి తులానికి రూ.1,07,070 చేరుకొని రికార్డు స్థాయికి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది.
బంగారం ధరలు వరుసగా పెరుగడం ఇది ఎనిమిదో సారి. 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.1000 పెరిగి తులానికి రూ.1,06,200 పెరిగింది. ఇక వెండి ధర కిలోకు రూ.1,26,100 వద్ద స్థిరంగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు ఆల్ టైమ్ హై 3,547.09 డాలర్లకు చేరింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు సడలింపు అంచనాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనల మధ్య గోల్డ్ డిమాండ్ బలంగా డిమాండ్ ఉందని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. ఒపెక్ ప్లస్ ఈ వారం చివరలో సమావేశం కానున్నందున చమురు ధరలు ఇటీవల కనిష్ఠ స్థాయి నుంచి పెరిగాయి. ఇటీవలి ఉక్రెయిన్ దాడి రష్యన్ చమురు ప్రాసెసింగ్ సామర్థ్యంలో 17 శాతాన్ని ప్రభావితం చేయడంతో రష్యన్ సరఫరాపై ఆందోళనలున్నాయని మెహతా పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణ డేటాను ప్రభావితం చేయవచ్చని.. డాలర్‌ను బలహీనపరిచే అవకాశం ఉందని.. బంగారానికి డిమాండ్ ఇవ్వొచ్చని పేర్కొన్నారు. వెంచురా కమోడిటీ అండ్ సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి మాట్లాడుతూ.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలపై అనిశ్చితితో పసిడికి మద్దతు లభిస్తోందని తెలిపారు. ఇదిలా ఉండగా.. వెండి ధర 0.11 శాతం తగ్గి 40.84 డాలర్లకు చేరుకుంది. వడ్డీ రేటు కోతల అంచనాలతో బంగారం మద్దతు పొందే అవకాశం ఉందని.. బంగారం పెరుగుదలతో లాభాల బుకింగ్ ఉండబోదని రామస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,06,970 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ.95,050 వద్ద ట్రేడవుతున్నది. ఇక కిలో వెండి రూ.1.37లక్షలు పలుకుతున్నది.