మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Business - Aug 06, 2020 , 00:11:01

గోల్డ్‌ రష్‌

గోల్డ్‌ రష్‌

  • ఒక్కరోజే రూ.1,365 పెరుగుదల
  • తులం ధర రూ.56,181కి చేరిక .. కిలో వెండి రూ.72వేల  పైమాటే

న్యూఢిల్లీ, ఆగస్టు 5: బంగారం ధరలు రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్నాయి. రోజుకో రికార్డును నమోదు చేస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే దేశ రాజధానిలో తులం రూ.1,365 ఎగబాకింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర ఢిల్లీలో రూ.56,181ని తాకింది. మంగళవారం ముగింపు ధర రూ.54,816గా ఉన్నది. మరోవైపు హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ. 57,820కి చేరింది. ఈ ఒక్కరోజే రూ. 1000కి పైగా ఎగబాకింది. ఇక కిలో వెండి ధర కూడా రూ.72వేలను దాటింది. ఒక్కరోజే రూ.5,972 పెరిగి రూ.72,726కు చేరింది. 

ఔన్సు 2వేల డాలర్లపైనే

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇదివరకెన్నడూ లేనివిధంగా అమెరికాలో ఔన్సు ధర 2 వేల డాలర్ల మార్కును దాటి 2,032 డాలర్లుగా నమోదైంది. ఔన్సు వెండి కూడా 26.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచీ విలువైన లోహాల ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న సంగతి విదితమే. 

ఎందుకీ దూకుడు

దేశీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ లేకున్నా ధరలు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మదుపరులు బంగారంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండటమే. కరోనా నేపథ్యంలో గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో తమ పెట్టుబడుల రక్షణార్థం మదుపరులు పసిడి వైపు చూస్తున్నారు. పైగా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం భయాలూ వెంటాడుతున్నాయి. డాలర్‌ విలువ పతనం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, పెరుగుతున్న కరోనా కేసులు ధరలను పైపైకి తీసుకెళ్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు పటేల్‌ అన్నారు. క్రిస్మస్‌ నాటికి ఔన్సు 2,200 డాలర్లను దాటవచ్చన్న అంచనాలున్నాయి.


logo