Gold Rates | న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 : బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లో ఆల్టైమ్ హైగా నిలిచాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి తులం విలువ రూ.70 పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా రూ.98,170గా నమోదైంది. బుధవారం ఒక్కరోజే రూ.1,650 ఎగబాకి తొలిసారి రూ.98వేల మార్కును గోల్డ్ రేటు అధిగమించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే హైదరాబాద్లో మాత్రం పుత్తడి ధరలు విజృంభించాయి. 24 క్యారెట్ 10 గ్రాముల విలువ రూ.1,140 ఎగిసి రూ.97,310కి చేరింది. అలాగే 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత లేదా నగల బంగారం) రేటు రూ.1,050 అందుకుని రూ.89,200 వద్ద నిలిచింది. కాగా, ఈ ఏడాది మొదలు పసిడి ధర దేశీయంగా 10 గ్రాములు రూ.19,220 లేదా 24 శాతం ఎగిసింది. గత ఏడాది డిసెంబర్ 31న తులం రేటు రూ.78,950 వద్ద ముగిసింది.
వెండి విషయానికొస్తే.. రూ.1,400 క్షీణించి కిలో ధర రూ.98,000కు పరిమితమైంది. ఇక గ్లోబల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 3,357.81 డాలర్లు పలికింది. సిల్వర్ 32.32 డాలర్లుగా ఉన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన ప్రతీకార సుంకాలు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్, బాండ్ మార్కెట్లలో తీవ్ర అలజడులను సృష్టిస్తున్నాయి. ఈ ఒడిదుడుకుల నుంచి తప్పించుకొనేందుకు మదుపరులు తమ పెట్టుబడులను పుత్తడి వైపునకు మళ్లిస్తున్నారు.