బంగారం ధరలు ఆకాశమే హద్దు అన్నట్టు దూసుకుపోతున్నాయి.
దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు ఒక్కరోజే మరో రూ.2వేలు ఎగిసి ఆల్‌టైమ్ హైకి చేరాయి.
24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి విలువ తొలిసారి రూ.94,150 పలికింది. గడిచిన 3 నెలల్లో రూ.15,200 ఎగబాకింది.
Gold Rates | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: బులియన్ మార్కెట్లో బంగారం ధగధగలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సామాన్య, సగటు మధ్యతరగతి వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకిన గోల్డ్ రేట్లు.. ఇంకా పైకి పోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం దేశీయంగా మరో ఆల్‌టైమ్ హైని చేరాయి. ఈ ఒక్కరోజే 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల ధర ఢిల్లీలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.94,150గా నమోదైంది. ఏకంగా ఒకేసారి తులం విలువ రూ.2,000 ఎగిసింది. దాదాపు గడిచిన రెండు నెలల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 10న రూ.2,400 పెరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. మరోవైపు మార్కెట్లో ధరలు పరుగులు పెడుతుండటంతో ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా బంగారం రేటు రూ.15,200 పుంజుకున్నది. గత ఏడాది డిసెంబర్ 31న 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.78,950 వద్ద ముగిసింది.
హైదరాబాద్‌లోనూ గోల్డ్ రేట్లు దూకుడు మీదున్నాయి. 24 క్యారెట్ తులం రూ.930 ఎగిసి రూ.92,840 పలికింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.850 పెరిగి రూ.85,100గా ఉన్నది. గత వారం రోజుల్లో 24 క్యారెట్ రేటు రూ.3,550, 22 క్యారెట్ 3,250 ఎగబాకడం గమనార్హం. కాగా, స్టాక్హోల్డర్లు, జ్యుయెల్లర్స్ నుంచి అమాంతం పెరిగిన డిమాండే మార్కెట్లో ఈ అప్ ట్రెండ్‌కు కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ వర్గాలు తెలిపాయి.
స్టాక్ మార్కెట్లు నష్టపోతుండటంతో అక్కడి పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మదుపరులకు బంగారమే కనిపిస్తున్నదని, ఇది కూడా ధరలను ఎగదోస్తున్నదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇదిలావుంటే ఢిల్లీలో వెండి ధర కిలో రూ.500 తగ్గింది. 1,02,500కు పరిమితమైంది. ఇక ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ రేటు జూన్ డెలివరీకిగాను రూ.91,400 పలికింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ రికార్డు స్థాయిలో 3,149.03 డాలర్లను తాకింది.