న్యూఢిల్లీ, మే 15: బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. అతి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రికార్డు స్థాయి లో దూసుకుపోయిన ధరలు మళ్లీ అంతే వేగంతో కిందికి పడిపోయాయి. డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతోపాటు పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో వీటి ధరలు తగ్గాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.3,200 లేదా 1.93 శాతం తగ్గి రూ.1,62,800కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1.66 లక్షలుగా ఉన్నది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.4,420 తగ్గి రూ.1,57,910కి చేరుకున్నది. తగ్గకముందు పుత్తడి రూ.1,62,330గా ఉంది. అలాగే 22 క్యారెట్ బంగారం ధర రూ.4,050 తగ్గి రూ.1,44,750కి చేరుకున్నది.
అత్యంత విలువైన లోహాల ధరలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ద్రవ్యోల్బణం కోరలు చాస్తుండటం, ఇంధన ధరలు భగ్గుమనడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడం ధరలు పడిపోవడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 136 డాలర్లు లేదా 2.92 శాతం తగ్గి 4,548.46 డాలర్లకు పడిపోగా, వెండి 8.45 డాలర్లు లేదా 10.41 శాతం తగ్గి 76.46 డాలర్లకు పరిమితమయ్యాయి.
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు కుదేలుకావడంతోపాటు దేశీయంగా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో వెండి ఏకంగా రూ.21 వేలకు పైగా పడిపోయింది. కిలో వెండి రూ.21,600 లేదా 7.3 శాతం తగ్గి రూ.2.75 లక్షలకు చేరుకుంది. అంతకుముందు వెండి రూ.2,96,600 వద్ద ఉన్నది. ఇటు హైదరాబాద్‌లో కిలో వెండి రూ.10 వేలు తగ్గి రూ.3 లక్షలుగా నమోదైంది.