చేవెళ్ల రూరల్, ఆగస్టు 7 : మండలంలోని రైతులు వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ఫార్మ్ పాండ్ల ఏర్పాటు, వనమహోత్సవం-2026లో భాగంగా మొకల పంపిణీ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారులు సూచించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పంటలకు అవసరమైన నీటి నిల్వ కోసం రైతుల పొలాల్లో ఫార్మ్ పాండ్ల ఏర్పాటుకు వ్యవసాయ శాఖ తరపున అవకాశం కల్పించనున్నట్లు మండల పరిధి ఖానాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గాయత్రి శుక్రవారం ఒక ప్రకటనలో పేరొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫార్మ్ పాండ్లను సాధారణంగా 20 20 మీటర్లు, మూడు మీటర్ల లోతుతో ఏర్పాటు చేస్తారని, అయితే భూమి స్వభావం, శాఖ మార్గదర్శకాల మేరకు పరిమాణాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని తెలిపారు. సొంత వ్యవసాయ భూమి కలిగి పథక నిబంధనలకు అనుగుణంగా అర్హత పొందిన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, అవసరమైతే ఉపాధి హామీ జాబ్ కార్డు, మొబైల్ నంబర్‌తో తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అదే సందర్భంగా వనమహోత్సవం-2026లో భాగంగా మండలంలోని గ్రామాల నర్సరీల్లో ఉన్న మొక్కలను అవసరమైన రైతులు సంబంధిత అధికారిని సంప్రదించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.