Gold Prices | న్యూఢిల్లీ, నవంబర్ 14: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు అంతే స్పీడ్‌తో కిందకు దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా కొనుగోళ్ల డిమాండ్ పడిపోవడంతో ధరలు మరింత తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లోతులం పుత్తడి ధర రూ.700 దిగొచ్చి రూ.77 వేల స్థాయికి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.77,750గా ఉన్నది.
ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం బంగారం ధర రూ.1,200 దిగి రూ.75,650కి తగ్గింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.1,100 తగ్గి రూ.70 వేల దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.69,350గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి రూ.2,310 తగ్గి రూ.90,190కి పరిమితమైంది.
హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,000 తగ్గి రూ.99 వేలుగా నమోదైంది. ఫ్యూచర్ ట్రేడ్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీకిగాను బంగారం ధర రూ.800 తగ్గి రూ.73,678కి చేరుకున్నది. అమెరికా ధరల సూచీ గణాంకాలు విడుదలకావడంతో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నదని, అలాగే ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 29.10 డాలర్లు తగ్గి రెండు నెలల కనిష్ఠ స్థాయి 2,557.40 డాలర్లకు పడిపోయింది.