Gold Rate | న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు దిగొచ్చాయి. ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి ధర శుక్రవారం రూ.93 వేల స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,350 తగ్గి రూ.93 వేలకు దిగొచ్చిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తాజాగా వెల్లడించింది. గురువారం రికార్డు స్థాయికి చేరుకున్న ధరల ఆ మరుసటి రోజే భారీగా తగ్గడం విశేషం.
డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన పుత్తడి నుంచి ఈక్విటీలవైపు మళ్లించడంతో తగ్గుముఖం పట్టాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. బంగారంతోపాటు వెండి భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.5,000 తగ్గి రూ.95,500కి దిగొచ్చింది.
గడిచిన నాలుగు నెలల్లో ఒక్కరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి కావడం విశేషం. బంగారం ధరలు వారం కనిష్ఠ స్థాయి, వెండి ఐదు వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నట్లు మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 21.74 డాలర్లు తగ్గి 3,093.60 డాలర్లకు పడిపోగా, వెండి 31.32 డాలర్లకు పరిమితమైంది.