న్యూఢిల్లీ, జూలై 28: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజూ సోమవారం కూడా పుత్తడి ధర మరో రూ.500 తగ్గింది. అమెరికా, యూరప్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీ మార్కెట్లకు తరలించడంతో వీటి ధరలు భారీగా పడిపోయాయి. దేశీయ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.98,020కి పరిమితమైంది.
గత శనివారం కూడా పుత్తడి విలువ రూ.600 తగ్గిన విషయం తెలిసిందే. గడిచిన నాలుగు రోజుల్లో పుత్తడి విలువ రూ.3 వేలు తగ్గినట్టు అయింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా అంతే స్థాయిలో తగ్గి రూ.97,750గా నమోదైంది.
బంగారంతోపాటు వెండి ధరలు తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి మరో వెయ్యి రూపాయలు తగ్గింది. దీంతో ధర రూ.1.13 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.14 లక్షలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,337.95 డాలర్లుగాను, వెండి 38.17 డాలర్లుగా ట్రేడవుతున్నది.