గోల్డ్ మార్కెట్ రివర్స్ గేర్ తీసుకున్నది.
మొన్నటిదాకా ఫుల్ స్వింగ్‌లో ఉన్న బంగారం ధరలు ఇప్పుడు డౌన్ ట్రెండ్‌లోకి జారుకున్నాయి.
రెండు రోజుల్లో తులం విలువ రూ.2,450 పతనమైంది మరి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ రేటు 10 గ్రాములు రూ.93,930 పలుకుతున్నది.
Gold prices | న్యూఢిల్లీ, మే 15 : దేశీయ మార్కెట్లో బంగారానికి గిరాకీ సన్నగిల్లిందా? అంటే.. అవునన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతకొద్దిరోజులుగా పసిడి ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల్లోనే పుత్తడి రేటు దాదాపు రెండున్నర వేల రూపాయలు పడిపోయింది. గురువారం 24 క్యారెట్ తులం విలువ రూ.1,800 దిగజారి రూ.95,050కి పరిమితమైంది. బుధవారం కూడా రూ.650 క్షీణించగా, సోమవారమైతే ఏకంగా రూ.3,400 పతనం కావడం గమనార్హం.
హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు దిగొస్తున్నాయి. గురువారం 24 క్యారెట్ తులం రేటు రూ.2,130 తగ్గి రూ.93,930గా నమోదైంది. 22 క్యారెట్ 10 గ్రాముల విలువ రూ.1,950 పడిపోయి రూ.86,100గా ఉన్నది. అయితే ధరల్లో స్థిరత్వం లోపించడం.. కొనుగోలుదారులను వేచిచూసే ధోరణిలోకి నెడుతున్నదని జ్యుయెల్లర్స్ వాపోతున్నారు. మార్కెట్లో ఈ ఒడిదొడుకులు తగ్గితే వ్యాపారం తిరిగి పుంజుకోవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత నెల ఏప్రిల్ 22న దేశీయంగా పసిడి ధర ఆల్‌టైమ్ హైని తాకుతూ తులం 24 క్యారెట్ రూ.1,01,600 పలికిన సంగతి విదితమే.
బంగారంతోపాటు వెండి ధరలూ దిగొస్తున్నాయి. వరుసగా నాల్గోరోజూ రేట్లు పడిపోగా.. గురువారం మరో రూ.1,000 తగ్గి కిలో వెండి విలువ రూ.97,000కు పరిమితమైంది. బుధవారం రూ.1,450 పతనమవగా, మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో రూ.2,900 క్షీణించినైట్టెంది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పడిపోతున్నాయని, ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా సహజంగానే ఉంటున్నదని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 16.81 డాలర్లు దిగి 3,160.71 డాలర్లకు చేరింది. మొత్తానికి ఆయా దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లు.. తమ పెట్టుబడులను బంగారం నుంచి వెనక్కి తీసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు. ఇది ధరల క్షీణితకు దారితీస్తున్నట్టు అభివర్ణిస్తున్నారు.