న్యూఢిల్లీ, మార్చి 8: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.615 దిగొచ్చి రూ.55 వేల స్థాయికి రూ.55,095కి పడిపోయింది. అంతకుముందు ఈ ధర రూ.55,710గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.2,285 తగ్గి రూ.62,025 వద్దకు జారుకున్నది.
ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం 56 వేల దిగువకు పడిపోయింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.56,350 నుంచి రూ. 55,630కి తగ్గింది. తులంపై రూ.720 తగ్గినట్లు అయింది. అలాగే 22 క్యారెట్ల ధర రూ.650 తగ్గి రూ.51 వేల స్థాయికి జారుకున్నది. రూ.2,500 తగ్గిన కిలో వెండి ధర రూ.67,500కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,814 డాలర్లకు పడిపోగా, వెండి 20.05 డాలర్లుగా నమోదైనట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. ధరలను నియంత్రించడానికి భవిష్యత్తులోనూ వడ్డీరేట్లను మరింత పెంచకతప్పదని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పొవెల్ వ్యాఖ్యలు పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.