న్యూఢిల్లీ, ఆగస్టు 13: బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ నెలకొనడంతో పుత్తడి ధర బుధవారం కూడా భారీగా పెరిగి రూ.73 వేల దిశగా పయనిస్తున్నది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధరూ.500 అధికమై రూ.72,850 పలికింది. అయినప్పటికీ వెండి ధర రూ.83,500 వద్ద ఫ్లాట్గా ముగిశాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇటు హైదరాబాద్లో పుత్తడి ధర రూ.1,040 ఎగబాకి రూ.71,620 పలికింది.
ఆకట్టుకున్న అపోలో
హైదరాబాద్, ఆగస్టు 13: అపోలో హాస్పిటల్స్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.రూ.5,068 కోట్ల ఆదాయంపై రూ.305 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,418 కోట్ల ఆదాయంపై రూ.167 కోట్ల లాభాన్ని గడించింది. నికర లాభం 83 శాతం వృద్ధిని కనబరిచినట్లు అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. కంపెనీ షేరు ధర 1.26 శాతం బలపడి రూ.6,586.55 వద్ద ముగిసింది.