న్యూఢిల్లీ, జూన్ 15: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాలతో అతి విలువైన లోహాల ధరలు రివ్వున ఎగిశాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర రూ.2 వేల పైకి ఎగబకింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో అయితే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,500 అధికమై రూ.1,59,400కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1,56,900గా ఉన్నది. బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.5 వేలు పుంజుకున్నది. దీంతో కిలో ధర రూ.2,60,700 పలికింది. గత సెషన్లో ఇది రూ.2,55,700గా ఉన్నది. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు చరమగీతం పాడుతూ అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగిన శాంతిచర్చలు కొలిక్కిరావడం వల్లనే గోల్డ్ ధరలు భారీగా పుంజుకున్నాయని విశ్లేషకులు వెల్లడించారు.
గతవారం క్రితం 4 వేల డాలర్ల స్థాయికి పడిపోయిన ఔన్స్ గోల్డ్ ధర ఒక్కసారిగా 4,300 డాలర్లకు పైకి చేరుకోవడం వల్లనే దేశీయంగా ధరలు అధికమయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. వీటికితోడు చమురు ధలు భారీగా పడిపోవడం, ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గే అవకాశం కూడా ఉండటం ధరలు పుంజుకోవడానికి పరోక్షంగా దోహదం చేశాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 121.33 డాలర్లు లేదా 3 శాతం ఎగబాకి 4,340.65 డాలర్లకు చేరుకోగా, వెండి 2.74 డాలర్లు లేదా 4 శాతం అందుకొని 70.74 డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ కెవిన్ వార్ష్ అధ్యక్షతన తొలి సమావేశం త్వరలో జరుగనుండటంతో దీనిపై మదుపరులు దృష్టి సారించారు. ఈ సమీక్షలో తీసుకునే నిర్ణయం, డాలర్ బలహీనపడటం మరో కారణాలని ఆయన పేర్కొన్నారు.
పసిడి దిగుమతుల్లో భారీ వృద్ధి
ఒకవైపు పొదుపు చర్యలు పాటించాలని మోదీ విజ్ఞప్తిని భారతీయులు పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. మే నెలలో ఏకంగా భారత్లోకి 3.41 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయింది. క్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతైన దాంతో పోలిస్తే 34 శాతం అధికం. కానీ, వెండి దిగుమతులు మాత్రం 86 శాతం తగ్గి 75.57 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అతి విలువైన లోహాల దిగుమతులను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీటిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచినప్పటికీ దిగుమతులు వాయువేగంతో పుంజుకోవడం విశేషం. ప్రస్తుతం పదిగ్రాముల బంగారం ధర రూ.1.60 లక్షల స్థాయిలో ఉండగా, వెండి రూ.2.60 లక్షల స్థాయిలో ఉన్నది. పసిడి దిగుమతులు పుంజుకోవడం వల్లనే వాణిజ్యలోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) 28.21 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు నివేదిక స్పష్టంచేసింది. గత నెలలో 45.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగగా, ఇదే సమయంలో 73.41 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకున్నది.