Gold Investment | రానున్నది పెండ్లిండ్ల సీజన్.. 2020 నుంచి కరోనా మహమ్మారి ప్రభావంతో పెండ్లిండ్లు నిలిచిపోయాయి. సెకండ్‌వేవ్ ఉధృతి కూడా తీవ్రంగా ఉండటంతో 2021లో పరిమితంగా వివాహాలు జరిగాయి. ప్రస్తుతం కరోనా కేసుల తీవ్రత తగ్గడంతో పెండ్లిండ్లు బాగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో తప్పనిసరి బంగారం కొనుగోలు చేయాల్సిందే. జువెల్లరీ (ఆభరణాలు) రూపంలో గానీ, ఇన్వెస్ట్మెంట్ రూపంలో గానీ ప్రతి ఒక్కరూ కొనాల్సిందే. బంగారం అంటే మనీ.. బంగారంపై ఏ రూపంలో పెట్టుబడి పెట్టినా మంచి ఇన్వెస్ట్‌మెంటే.
మీరు ఆభరణాల దుకాణానికి వెళ్లినప్పుడు సదరు ఆభరణాల వ్యాపారి మీకు రెండు ఆప్షన్లు ఇస్తారు. 22 కే, 24 కే ల్లో దేనికి ప్రాధాన్యం ఇస్తారో తెలుసుకోండని సూచిస్తారు. కే అంటే క్యారట్.. బంగారం స్వచ్ఛత (ప్యూరిటీ) క్యారట్లలో గుర్తిస్తారు. ఎక్కువ క్యారట్లలో బంగారం ఉంటే దాని స్వచ్ఛత ఎక్కువ. 24 క్యారట్ల బంగారం అంటే అత్యంత స్వచ్ఛత గల బంగారం లభిస్తుంది. 22 క్యారట్లు, 24 క్యారట్ల బంగారం స్వచ్ఛతలో చాలా తేడాలు ఉన్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో గత వారం వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు నిలకడగా సాగుతున్నాయి. బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు పెట్టుబడికి ప్రత్యామ్నాయ మార్గం కూడా.. అయితే, త్వరలో అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు పెంచనున్నట్లు సంకేతాలిచ్చింది. మూడేండ్ల తర్వాత అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు పెంచుతుండటంతో డాలర్ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.కనుక ఇన్వెస్టర్లు బంగారంపై మదుపు విషయమై ఆచితూచి స్పందిస్తున్నారు.
దీంతో ఈ నెల 12న మేలిమి బంగారం తులం ధర రూ.52,800 పలికితే, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400గా నమోదైంది. శనివారం 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.51,600 పలికింది. అదే 22 క్యారట్ల బంగారం తులం 47,300 వద్ద స్థిర పడింది. శుక్రవారంతో పోలిస్తే 24 క్యారట్ల బంగారం ధర 170, 22 క్యారట్ల బంగారం ధర రూ.100 తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికిప్పుడు శుభకార్యాలకైనా.. పెట్టుబడికైనా ధరలు తగ్గుతున్నప్పుడే బంగారం కొనుగోలు చేయడం బెటరంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.
24 క్యారట్ల బంగారం అంటే 99.9 ప్యూరిటీ ఉంటుంది. వాటిల్లో ఇతర లోహాలకు చోటు ఉండదు. 24 క్యారట్ల బంగారం కంటే ప్యూరిటీ గల గోల్డ్ ఉండనే ఉండదు. 22 కే, 18కే గోల్డ్ కంటే అత్యంత విలువైందీ 24 కే బంగారం. భారత్‌లో 24కే బంగారం ధర రోజురోజుకూ మారుతూ ఉంటుంది. ఇది ఫైనాన్సియల్ అవసరాలకు సూటబుల్.. తర్వాత సాఫ్ట్‌గా మారుతుంది కనుక జ్యువెల్లరీగా పనికి రాదు.
22 క్యారట్ల తులం బంగారంలో 22 క్యారట్ల స్వచ్చత ఉంటుంది. మిగతా రెండు క్యారట్ల స్థానంలో జింక్, రాగి తదితర లోహాలు మిక్స్ చేస్తారు. ఇది 24 క్యారట్ల బంగారం కంటే టఫ్. జ్యువెల్లరీ తయారీకి ఇది సూటబుల్. ఇందులో 91.67 శాతం ప్యూరిటీ ఉంటుంది. అందుకే దీన్ని 916 గోల్డ్ అని అంతా పిలుస్తుంటారు.
ఇన్వెస్ట్మెంట్ కోసమైతే 24 క్యారట్ల బంగారం ఐడియల్ చాయిస్. ఎందుకంటే 24 క్యారట్ల బంగారం అంటే పూర్తి స్వచ్ఛతతో కూడుకుని ఉంటుంది. ఈ క్యాటగిరీలో 24కే గోల్డ్ కాయిన్ లేదా బార్ కొనుగోలు చేయడం బెటర్ అనే అభిప్రాయం ఉంది. మీరు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం కాకుంటే 24 క్యారట్ల బంగారం కొనుగోలు చేయడం ఏ విధంగానూ రైట్ చాయిస్ కాదని నిపుణులు అంటున్నారు.
ప్రతి రోజూ ధరించే ఆభరణాలంటే 22 క్యారట్ల బంగారం కొనుక్కోవడం బెస్టంటున్నారు బులియన్ నిపుణులు. జ్యువెల్లరీ వ్యాపారులు.. ఆభరణాలు డిజైన్ చేసి తయారు చేయడానికి 22 క్యారట్ల బంగారం అనువుగా ఉంటుంది. మిగతా రెండు క్యారెట్ల ఇతర లోహాలతో 22 క్యారట్ల బంగారం కలిపితే ఆభరణాలు తయారు చేయడానికి సూటబుల్‌గా ఉంటుంది. క్యారట్లను బట్టి బంగారం స్వచ్ఛత ఉంటుంది. మీరు 14 కే గోల్డ్ రింగ్ కొన్నారనుకోండి. దాన్ని 24తో బాగిస్తే 0.583కి సరిపోతుంది. అంటే 14కే గోల్డ్ రింగ్‌లో బంగారం కంటెంట్ 58.3 శాతం ఉంటుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే బంగారంలోని క్యారట్లను బట్టి దాని స్వచ్ఛతకు గ్యారంటీ లభిస్తుంది.