న్యూఢిల్లీ, అక్టోబర్ 7: బంగారం ధర మరింత పెరిగింది. దేశీయంగా తులం తొలిసారి రూ.1.24 లక్షలు పలికింది. మంగళవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు ఢిల్లీలో రూ.700 పుంజుకొని రూ.1,24,000గా నమోదైందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలియజేసింది. భారతీయ మార్కెట్లో ఇదే ఆల్టైమ్ హై రికార్డు. అమెరికా ప్రభుత్వ షట్డౌన్తోపాటు, వడ్డీరేట్లను ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంకా తగ్గిస్తుందన్న అంచనాల మధ్య మదుపరులు తమ పెట్టుబడులను సురక్షిత సాధనమైన పుత్తడి వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సోమవారం రూ.2,700 పెరిగిన సంగతి విదితమే. ఇదిలావుంటే మంగళవారం వెండి ధర భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ ఒక్కరోజే కిలో రూ.3,400 పడిపోయి రూ.1,54,000 కు పరిమితమైంది. సోమవారం ఏకంగా రూ.7,400 ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో కిలో రూ.1,57,400గా నమోదైన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్లో 24 క్యారెట్ తులం విలువ రూ.1,250 ఎగసి రూ.1,22,020ను తాకింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) ధర రూ.1,150 పెరిగి రూ.1,11,850గా ఉన్నది.
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 4,900 డాలర్లకు చేరవచ్చని గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేసింది. ప్రస్తుతం 4,000 డాలర్ల సమీపంలో ధరలు కదలాడుతున్నాయి. దీంతో భారతీయ మార్కెట్లోనూ సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరగడం ఖాయమనే చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నడుమ అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయని, గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లోకి పెట్టుబడుల ప్రవాహం కూడా పెరుగుతున్నదని గోల్డ్మన్ సాచ్స్ అంటున్నది. కాగా, మంగళవారం గ్లోబల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 3,958.18 డాలర్లుగా ట్రేడైంది. అయితే ఒకానొక దశలో ఆల్టైమ్ హైని తాకుతూ 3,977.45 డాలర్లను తాకడం గమనార్హం.