న్యూఢిల్లీ, జూలై 2: గత కొన్ని రోజులుగా భారీగా తగ్గి సామాన్యుడికి ఊరట కల్పించిన అతి విలువైన లోహాలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు అనూహ్యంగా పసిడి, వెండి ధరలు పుంజుకోవడంతోపాటు డాలర్‌కు డిమాండ్ పడిపోవడం వీటి ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.3 వేలు అధికమై రూ.1,47,500 పలికింది. అంతకుముందు ఇది రూ.1,44,500గా ఉన్నది. బంగారంతోపాటు వెండి పరుగులు పెడుతున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా వరుసగా మూడోరోజూ గురువారం కూడా రూ.5 వేలు అధికమై రూ.2.40 లక్షలు పలికింది. అంతకుముందు ఇది రూ.2.35 లక్షలుగా ఉన్నది.
ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.3,770 అధికమై రూ.1,44,550కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.3,450 ఎగబాకి రూ.1,32,500 పలికింది. అలాగే కిలో వెండి రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్ల వల్లనే ఇప్పట్లో వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవని అమెరికా ఫెడ్ చీఫ్ ప్రకటించడంతో వీటి ధరలు రివ్వున ఎగిశాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 38.75 డాలర్లు లేదా ఒక్క శాతం పెరిగి 4,070.04 డాలర్లకు చేరుకోగా, వెండి 1.3 శాతం అందుకొని 59.89 డాలర్లు పలికింది.