న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: బంగారం సామాన్యుడికి అందనంటున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అమెరికా హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇతర కరెన్సీలు భారీగా పతనమవుతున్నాయి. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలకు మళ్లించడంతో వీటి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర మంగళవారం ఒకేరోజు రూ.2,700 ఎగబాకి రూ.1,18,900 పలికింది. సోమవారం రూ.2,200 పెరిగిన ధర ఆ మరుసటి రోజు ఇంతకంటే అధికంగా నమోదైంది. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే పుత్తడి ఏకంగా రూ.5 వేలకు పైగా ఎగబాకినట్టు అయింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.2,650 అందుకొని మరో చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,18,300కి చేరుకున్నది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.2 వేలు అందుకొని రూ.1,19,00 పలికింది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ వెండి మరో ఉన్నత శిఖరాలను అధిరోహించింది. కిలో వెండి రూ. 3,220 ఎగబాకి ఆల్‌టైం హై రూ.1,39, 600కి చేరుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బక్కచిక్కడం, హెచ్1-బీ వీసా ఫీజు పెంచడంతో దేశీయ ఐటీ సంస్థలపై పిడుగుపడ్డట్టు అయిందని దీంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు పరుగెత్తుతున్నాయని హెచ్డీఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి.
బంగారం ధరలు త్వరలో 2 లక్షలకు చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. గడిచిన ఐదేండ్లలో 50 శాతం వరకు పెరిగిన ధరలు వచ్చే ఐదేండ్లలో ఇదే స్పీడ్‌తో రూ.2 లక్షలను అధిగమించవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా ఆర్థిక పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు ఎగబడి పుత్తడిని కొనుగోలు చేయడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.