న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత వారంలో భారీగా తగ్గిన అతి విలువైన లోహాలు మళ్లీ అదే వేగంతో దూసుకుపోతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఆరు శాతం బలపడగా, పసిడి ధరలు ఒక్క శాతం చొప్పున ఎగబాకాయి. సోమవారం కిలో వెండి ఏకంగా 6 శాతం లేదా రూ.17 వేలు ఎగబాకి రూ.2.72 లక్షలు పలికింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర రూ.1,300 అందుకొని రూ.1,58,500 పలికింది.
ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధర రూ.2 వేల వరకు అధికమై రూ.1.61 లక్షలకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ధరలు భారీగా పుంజుకోవడం, అమెరికా డాలర్ బలహీనంగా ట్రేడవుతుండటం వల్లనే ధరలు పుంజుకుంటున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచుగా పాలసీలను మార్చడం కూడా ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణమన్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి 2.19 డాలర్లు లేదా 2.81 శాతం పెరిగి 80.21 డాలర్లకు చేరుకోగా, బంగారం 5 వేల డాలర్లు అధిగమించింది.