న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పసిడి పరుగులు పెడుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకుతున్న విలువ మరో శిఖరానికి చేరుకున్నది. వరుసగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ధర మంగళవారం పదిగ్రాముల ధర మరో రూ.400 ఎగబాకి రూ.1.06 లక్షలకు చేరుకున్నది. అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పుంజుకుంటున్నాయి.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర అంతే పెరిగి రూ.1,05, 200 పలికింది. గడిచిన ఏడు రోజుల్లో బంగారం రూ.5,900 పెరిగినట్టు అయింది. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు 34.35 శాతం ఎగబాకింది. డిసెంబర్ 31, 2024న రూ.78,950 స్థాయిలో ఉన్న తులం ధర ప్రస్తుతం రూ.1.06 లక్షల స్థాయికి చేరుకున్నది. మరోవైపు, కిలో వెండి రూ.1,26, 100 పలికింది.