Gold Prices | న్యూఢిల్లీ, జూలై 1 : దేశీయ మార్కెట్లో దాదాపు 2 వారాలపాటు తగ్గడం లేదా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరలు.. మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజే ఏకంగా రూ.1,200దాకా ఎగిశాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.1,200 పుంజుకొని రూ.98,670గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల మధ్య గోల్డ్ స్టాకిస్టులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగారని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. దీనివల్లే స్పాట్ మార్కెట్లో ధరలు పెరిగాయంటున్నారు.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం ధర రూ.1,140 ఎగిసి రూ.98,400 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) గోల్డ్ రేటు రూ.1,050 ఎగబాకి రూ.90,200గా నమోదైంది. కాగా, గతకొద్ది రోజులుగా అంతంతమాత్రంగానే ఉన్న డిమాండ్‌తో తులం పసిడి విలువ రూ.3,000 వరకు పడిపోయిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలు, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు.. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే మదుపరులు తిరిగి తమ పెట్టుబడులను సురక్షిత మదుపు సాధనాలైన గోల్డ్ వైపునకు మళ్లిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు దూరంగా ఉన్న ఆయా దేశాలపై ఈ నెల 9 నుంచి ప్రతీకార సుంకాలుంటాయన్న అంచనాలు సైతం గోల్డ్ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తున్నది.
బంగారంతోపాటు వెండి ధరలూ ఎగిశాయి. కిలో ధర మంగళవారం రూ.2,000 పుంజుకున్నది. దీంతో ఢిల్లీలో రూ.1,04,800గా నమోదైంది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాలతోపాటు సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెప్తున్నారు. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 44.01 డాలర్లు పెరిగి 3,346.92 డాలర్లకు చేరింది.