Gold Rates | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధరలు గురువారం భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుపై వెనక్కి తగ్గడంతోపాటు చైనాపై ప్రతీకార సుంకాలను 145 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఆందోళన పెంచిందని, ఫలితంగా తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకాయి.
గురువారం ఒకేరోజు దేశీయంగా పదిగ్రాముల బంగారం ధర రూ.3 వేల వరకు ఎగబాకింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర రూ.2,940 ఎగబాకి రూ.93,530కి చేరుకున్నది. అటు ముంబైలోనూ రూ.2,940 అధికమై రూ.93, 380 పలికింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.93,380కి చేరుకున్నది.
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ముంబైలో కిలో వెండి ఏకంగా రూ.2 వేలు పుంజుకొని రూ.95 వేలకు చేరుకున్నది. అలాగే హైదరాబాద్లో రూ.5 వేలు అధికమైన కిలో వెండి రూ.1.07 లక్షలుగా నమోదైంది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒక్క శాతం ఎగబాకి 3,116 డాలర్లకు చేరుకోగా, వెండి 30.96 డాలర్లుగా ఉన్నది.