Gold price : బంగారం ధరలు భగ్గున మండిపోతున్నాయి. పసిడి ధర శరవేగంగా పరుగు తీస్తోంది. ఇవాళ (సోమవారం) సరికొత్త రికార్డును నమోదు చేసింది. 10 గ్రాముల మేలిమి పసిడి ధర లక్ష రూపాయలకు చేరువైంది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీన పడటం లాంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలో అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి సోమవారం 3,400 డాలర్లకు చేరింది. దాంతో దేశీయంగా తులం బంగారం లక్ష రూపాయల మార్కుకు దగ్గరైంది. సోమవారం సాయంత్రానికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో 24 క్యారెట్స్ పసిడి రూ.96,805కు చేరింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ 5 కాంట్రాక్ట్ 1.65 శాతం గరిష్టంగా 96,830 వద్ద ట్రేడైంది. దేశంలో స్పాట్ గోల్డ్ ధరలు కూడా పెరిగాయి.
ఇండియా బులియన్ అండ్ జ్యుయెలర్స్ అసోషియేషన్ (IBJA) ప్రకారం.. 99.9 ప్యూరిటీ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.96,590 గా ఉంది. 22 క్యారెట్స్ గోల్డ్ ధర 94,270 గా నమోదైంది. 20 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ.85,960, రూ.78,240 గా ఉన్నాయి. త్వరలోనే తులం 24 క్యారెట్ గోల్డ్ లక్ష రూపాయల దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అది రేపే జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బంగారం ధర దాదాపు రూ.20 వేలకుపైనే పెరిగింది. డిసెంబర్ 31న సుమారు రూ.79 వేలు ఉన్న పసిడి ధర గడిచిన మూడున్నర నెలల్లో 26 శాతం మేర పెరిగింది. అటు వెండి ధర సైతం కిలో రూ.లక్షకు చేరువవుతోంది. గతంలో ఓసారి లక్ష మార్కును దాటిన వెండి ప్రస్తుతం రూ.99,299 పలుకుతోంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేవరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.