న్యూఢిల్లీ, నవంబర్ 3: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే కొనేయండి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.51 వేల దిగువకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు దేశీయంగా డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో ధరలు తగ్గుతున్నాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం ధర రూ.400 తగ్గి రూ.50,600 వద్ద ముగిసింది.
వెండి ఏకంగా రూ.1,240 దిగొచ్చి రూ.58,110 వద్ద నిలిచింది. హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.160 తగ్గి రూ.50,950కి, 22 క్యారెట్ల ధర రూ.150 తగ్గి రూ.46,700 వద్ద ముగిశాయి. అలాగే కిలో వెండి రూ.500 దిగొచ్చి రూ.64 వేలకు చేరుకున్నది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపై ప్రభావం చూపింది. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లతోపాటు బులియన్ ధరలు భారీగా తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1.67 శాతం తగ్గి 1,620 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.