హైదరాబాద్, జూన్ 7: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతీకార సుంకాలపై అక్కడి కోర్టు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో ధరలు భారీగా తగ్గాయి. ఇదే క్రమంలో గతవారంలో లక్ష రూపాయలను అధిగమించిన పుత్తడి ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.98 వేల దిగువకు పడిపోయింది. పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,630 తగ్గి రూ.97,970కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.99,600గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ రూ.1,500 తగ్గి రూ.89,800కి తగ్గింది.
గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి శాంతించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో దేశీయంగా ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,18,000 వద్ద కొనుసాగుతున్నది. ప్రస్తుత నెలలో కిలో వెండి ఏకంగా రూ.6 వేలకు పైగా ఎగబాకినట్టు అయింది.
బంగారం ధరలు భారీగా తగ్గబోతున్నాయా అంటే అవును అంటున్నాయని ఇండస్ట్రీవర్గాలు. వచ్చే రెండు నెలల్లో 12-15 శాతం వరకు తగ్గి రూ.85 వేలకు తులం ధర దిగిరానున్నట్టు బ్రోకరేజ్ సంస్థ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అంచనావేస్తున్నది. ప్రస్తుతం ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం ధర రూ.98 వేల స్థాయిలో కదలాడుతున్నది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 34 శాతం పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న గోల్డ్ ధర..స్వల్పకాలంలో భారీగా పడిపోనున్నదని వెల్లడించింది. మరో రేటింగ్ ఏజెన్సీ మార్నింగ్‌స్టార్ కూడా గోల్డ్ ధర 38 శాతం పడిపోనున్నదని అంచనావేస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,361.73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.