న్యూఢిల్లీ, ఆగస్టు 28: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. డాలర్ బలహీనపడటంతోపాటు ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్‌ను మొగ్గుచూపడంతో దేశీయంగా పుత్తడి ధర భారీగా పడిపోయింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర శుక్రవారం ఏకంగా రూ.3,300 తగ్గి రూ.1.62 లక్షలకు పడిపోయింది. వరుసగా ధరలు తగ్గడం ఇది మూడోరోజు కావడం విశేషం. గత మూడు సెషన్లలో గోల్డ్ ఏకంగా రూ.4,700 లేదా 3 శాతం తగ్గినట్టు అయింది. ఈ నెల 25న గోల్డ్ ధర రూ.1,67,100గా ఉన్న విషయం తెలిసిందే.
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో కిలో వెండి రూ.5 వేలు తగ్గి రూ.2,45,500లకు పడిపోయింది. గత ముగింపు రూ.2,50,500గా ఉన్నది. ఈ వారంలో బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయని, ట్రేడర్లు బుకింగ్ ప్రాఫిట్‌కు మొగ్గుచూపడం, డాలర్ బలహీనపడటం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించే అవకాశాలు ఉన్నట్టు వచ్చిన వార్తలు కూడా ధరలు తగ్గడానికి మరో కారణమని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,599.70 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి 70.31 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.