హైదరాబాద్‌లో రూ.820 దిగిన తులం ధర
హైదరాబాద్, ఆగస్టు 7: పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారు ఆభరణాల కొనుగోలుదార్లకు శుభవార్త. శనివారం బంగారం ధర భారీగా దిగివచ్చింది. హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్కసారిగా 820 మేర తగ్గి రూ.47,840 వద్దకు చేరింది. క్రితం రోజు ఈ ధర రూ.48,660. అలాగే 22 క్యారట్ల పుత్తడి ధర రూ.750 తగ్గుదలతో రూ. 44,600 నుంచి రూ.43,850కు దిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నదన్న గణాంకాలు వెలువడుతుండటంతో అక్కడి కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ త్వరితంగా వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు&పుత్తడి పతనానికి దారితీసింది. అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక పెట్టుబడిగా కొనుగోలు చేసిన బంగారాన్ని శుక్రవారం రాత్రి మదుపుదారులు జోరుగా విక్రయించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 45 డాలర్లు పడిపోయి 1,763 డాలర్లస్థాయికి తగ్గింది. ఈ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ ఇండియాలో కూడా బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం రాత్రి మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో ట్రేడయ్యే 10 గ్రాముల పుత్తడి ఫ్యూచర్ ధర రూ.960 మేర క్షీణించి రూ.46,660 వద్ద ముగిసింది. జూన్-జూలై నెలల్లో అంతర్జాతీయంగా బంగారం ధరకు మద్దతునిస్తున్న 1,780 డాలర్ల స్థాయిని కోల్పోయినందున, రానున్న కొద్దిరోజుల్లో ఇది మరింత తగ్గవచ్చని, ఎంసీఎక్స్‌లో ఈ ధర రూ.45,800 వరకూ తగ్గవచ్చని అంచనావేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ చెప్పారు. గతేడాది ఆగస్టులో రూ.56,000 రికార్డుస్థాయికి చేరిన బంగారం, ఈ ఏడాదికాలంలో రూ.9,000 మేర తగ్గడం గమనార్హం.
వెండిదీ ఇదే బాట
బంగారం దారిలోనే మరో విలువైన లోహం వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర భారీగా రూ.1,500 వరకూ పడిపోయింది. శుక్రవారం రూ.71,700గా ఉన్న కిలో వెండి శనివారం రూ.70,200కు తగ్గింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 3.8 శాతం తగ్గి 24.33 డాలర్లకు చేరింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌లో కిలో వెండి ఫ్యూచర్ కాంట్రాక్టు రూ.2,023 మేర పడిపోయి, రూ.64,975 వద్ద ముగిసింది.